Mohan Babu: నిర్మల్, డిసెంబర్ 12 (మన బలగం): వార్త సేకరణ కోసం వెళ్లిన టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన సీనియర్ సినీనటుడు మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ… మోహన్ బాబు విలనిజం జర్నలిస్తులపై నడవదన్నారు. ఒక సినిమా నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా, పార్ట్ టైం రాజకీయ వేత్తగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా, రియల్ ఎస్టేట్ ఓనర్‌గా ఎన్ని పాత్రలు వేసినా తన క్రిమినల్ బుద్ధిని మోహన్ బాబు ఏనాడూ వదిలి పెట్ట లేదని ధ్వజమెత్తారు. నిజాలను భరించే శక్తిలేక జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు వీరావేశంగా దాడి చేయడం అర్థం అవుతుందన్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నిర్మల్ ప్రెస్‌క్లబ్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, అల్లం అశోక్, టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి.పోశెట్టి, గుమ్మల అశోక్, సోషల్ మీడియా కన్వీనర్ యేగేష్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శులు మనోజ్, హనుమాండ్లు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల రిపోర్టర్స్ శ్రీనివాస్, నరేందర్, ఉస్మాన్, పి.శ్రీనివాస్, ఆనంద్, రంజిత్, శివ, నాని భోజన్న, రవీందర్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.