- గుజరాతోడు బెదిరిస్తే భయపడెటోడు కాడు రేవంత్
- ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిజర్వేషన్ల చిట్టా విప్పుతా
- బీజేపీకి 400 సీట్లిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే
- అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టాం..
- లోక్‌సభ ఎన్నికల్లో మోడీని పాతిపెడదాం
- కోరుట్లలో లక్ష.. జగిత్యాలలో లక్ష మెజారిటీ ఇచ్చి జీవనన్నను గెలిపించండి
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తానని మాటిస్తున్న
- కోరుట్ల జన జాతరలో మోడీ, షాలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ‘తెలంగాణ పోరుగడ్డ మీద పుట్టినోడిని.. కొమురం భీమ్.. చాకలి ఐలమ్మ.. సర్వాయి పాపన్న.. దొడ్డి కొమురయ్య.. వంటి ఎందరో తెలంగాణ పోరాట యోధులు పుట్టిన నేలతల్లి రక్తం పంచుకుని పుట్టినోడిని.. మీ గుజరాత్ పెత్తందార్ల బెదిరింపులకు భయపడెటోడు కాదు ఈ రేవంత్ రెడ్డి.’ అని కోరుట్ల జనజాతర సభలో ప్రధాని నరేంద్ర మోడీ – అమిత్ షా లపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మోడీ,షా, కేసీఆర్, అరవింద్‌లపై ఫైర్ అయ్యారు.
తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు
దేశంలో 17 సార్లు జరిగిన ఎన్నికలు ఒకెత్తు.. 18వ సారి జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తు అని రేవంత్ అన్నారు. 10 ఏళ్లపాటు ప్రధానిగా పాలించిన మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగినా.. రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా.. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా అడిగినా.. మూసీ నదికి నిధులడిగినా ఇలా ఏది కావాలన్నా ఇవ్వలేదు కానీ ‘గాడిద గుడ్డు’ను ఇచ్చారని ఎద్దేవా చేశారు.
చిట్టా విప్పుతా..
తెలంగాణాకు ఏం చేశారని ఓట్లడుగుతున్నారు.? మీకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి.? మీకు ఈసారి పూర్తి స్థాయిలో మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి అంబానీ, అదానీలకు గంపగుత్తగా అమ్మేద్దామని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయటానికి భారీస్థాయిలో కుట్ర చేస్తున్నట్టు తన దగ్గర పూర్తి సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి చిట్టా విప్పుతానన్నారు.
నిజాం, రజాకార్లకు పట్టిన గతే బీజేపి వారికి
4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 50 లక్షల యువత తన వెంట ఉందని, ప్రజలు ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా, కుల, మత, ప్రాంతాల మధ్య వివక్ష కారణంగా ఎన్నో వేల కుటుంబాలు చిన్నాభిన్నమై చితికిపోయి ఉన్నాయని అన్నారు. వాళ్లకు మేలు జరిగే రిజర్వేషన్లను కుట్రపూరితంగా రద్దు చేసి గద్దెనెక్కుతామంటే అమాయక ప్రజల ఉసురు ఉప్పెనగా మారి నిజాం, రజాకార్లకు పట్టిన గతే మీ బీజేపి వారికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి.. గుజరాత్ పెత్తందార్ల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివని రేవంత్ అన్నారు. ఇక్కడ పక్కూరోడు పంచాయతీ పెడితే ఊరుకోని తెలంగాణ పౌరుషం మాది అలాంటిది ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తే ఎలా భయపడతాం.. ఖబడ్దార్ ‘మోడీ-షా’బ్ అని సవాల్ విసిరారు.10 ఏళ్లు ప్రధానిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీకు వయసులో పెద్దవారని.. తాను వయసులో చిన్నవాడినే అయినా ఒక తెలంగాణ పౌరునిగా ముఖ్యమంత్రిగా మీకు గౌరవం ఇస్తా అంతే గాని.. కేసులు పెడతాం, జైల్లో పెడతామని బెదిరిస్తే భయపడేంత పిరికోడిని కాదని రేవంత్ తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టినం
ఎందరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, ప్రాణత్యాగం చేసి పోరాడితే సిద్ధించిన తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. మరోసారి గెలిపిస్తే దొరల కాళ్ల దగ్గర పడుండి బానిస బతుకు బతికేవారమని అన్నారు. దొరల అహంకారానికి, దాష్టికానికి బలైన వారి ఆగ్రహానికి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నడుం విరిగి మూలనపడ్డారని.. ఆదరించిన ప్రజలను అణగదొక్కాలని ప్రయత్నిసైతే బొందపెడతారని స్పష్టం చేశారు.
రాహుల్ పాదయాత్ర వల్లే అధికారంలోకి
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశాన్ని 10 ఏళ్ల కాలంలో బీజేపీ సర్వనాశనం చేశారని.. దీనికి రాహూల్ గాంధీ నడుంబిగించి 150 రోజులపాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారన్నారు. ఆ యాత్రలో ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పీజీలు, పీహెచ్‌డీలు తోడుగా వచ్చారని, భారతదేశంలో 52 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలం ఉన్నామని, ఈ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని వారు రాహూల్ గాంధీ దృష్టికి తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి ఓటు వేస్తే ప్రజలు కార్పొరేట్ల దాష్టికానికి దాసోహం కాక తప్పదని హెచ్చరించారు.
జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి
43 ఏళ్లుగా జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజాసేవలో ఉన్నారని, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సబ్ కమిటీ వేశామని, పసుపు బోర్డు, గల్ఫ్ బోర్డు, మామిడి ప్రాసెస్ యూనిట్ల ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మనకంటూ ఓ వాయిస్ ఉండాలన్నారు. దీనికి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి 2 లక్షల మెజారిటీ సాధించాలని కోరారు. నేను కోరినట్టు మెజారిటీ ఇస్తే.. మీరు కోరినట్టు నిధులు ఇస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. జనజాతరకు జనాలను సమీకరించిన జువ్వాడి నర్సింగరావును అభినందిస్తూనే.. జీవన్ రెడ్డిని గెలిపించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు.
బీడీ పరిశ్రమను రేవంత్ ఆదుకోవాలి : చాడా వెంకట్ రెడ్డి
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే గాకా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడీ తయారీ పరిశ్రమ సంక్షోభంలో ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధ తీసుకుని ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీవన్ రెడ్డిని తాను 40 ఏళ్లుగా చూస్తున్నానని, తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులనలకరించినా ఆ పదవికే వన్నెతెచ్చాడని కొనియాడారు. పదేళ్ల కాలంలో మోడీ ప్రధాని అయ్యాక దేశం భ్రష్టు పట్టిందని ఆరోపించారు. మరోసారి బీజేపీని గెలిపిస్తే ప్రజాస్వామ్యం ముసుగులో కుల, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతారని మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన వాళ్లను జైళ్లలో పెడతారని ధ్వజమెత్తారు. ఇది వరకు ప్రశ్నించిన ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌లను జైళ్లో పెట్టించారన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జైళ్లలో పెట్టాలన్న కుట్రపన్ని ఢిల్లీ పోలీసులచే అమిత్ షా నోటీసులు పంపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదన్నారు. నిజామాబాద్ ప్రాంత రైతులను ఆదుకునేందుకు చెక్కర ఫ్యాక్టరీ తెరిపించాలని, అదేవిధంగా సంక్షోభంలో పడిన బీడీ పరిశ్రమను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. మాట తప్పడు.. మడమ తిప్పడు.. జీవన్ రెడ్డిని గెలిపిస్తే సీఎం కేంద్రంలో గెలుస్తాడన్నారు. ఇందుకోసం జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, సీపీఐ, సీపీఎం పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నాయని తెలిపారు.