- పేలుతున్న వ్యంగ్యాస్ర్తాలు
- ఒకరిపై ఒకరు సెటైరికల్ పంచులు
- కదనరంగంలో నవ్వులు పూయిస్తున్న మాటలు
మన బలగం, తెలంగాణ బ్యూరో
POLITICAL CRACKERS: పార్లమెంట్ ఎన్నికల వేళ పొలిటికల్ పటాకులు పేలుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పంచులు కదన రంగంలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో ఒక పార్టీ వారు కాకుండా ప్రతిపార్టీకి చెందిన బడా లీటర్లు తమ ప్రత్యర్థులపై వేస్తున్న పంచులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈక్రమంలో ప్రచారంలో పొలిటికల్ పటాకుల పదనిసలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో ఓట్ల పండుగ నడుస్తున్నది. అన్ని పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇవి రోడ్ షోలు, మీటింగ్ లకు వచ్చే జనాలకు నవ్వులను పంచుతున్నాయి. ఒక పార్టీ వారు ఇంకొకరిపై, ఒక అభ్యర్థి తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్ర్తాలను వదులుతున్నారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ పంచులకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఆయన మాట్లాడాడంటే అందరూ అలా నిలబడి వింటుంటేవారు. ఆయన అలాగే ఫేమస్ అయ్యారు కూడా. ఈయన బాటలోనే ఇప్పుడు అందరూ నడుస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన నాయకులంతా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలపై సూటిగానే వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.
పేలుతున్న సెటైర్లు..
ఆయా పార్టీలు కదనరంగంలో ముందుకు సాగుతూనే ఇతర పార్టీలు, వ్యక్తులపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పొలిటికల్ సెటైర్లు వ్యక్తిగత విమర్శలకు తావిస్తున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి : దొరికిన కాడికి దోచుకోవడం.. ఫామ్ హౌస్ లో దాచుకోవడం..
తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు(బీజేపీ ప్రభుత్వంపై)
హరీశ్ రావు : ప్రభుత్వ తీరు‘ఓడ దాటే దాకా ఓడ మల్లన్న.. ఓడదాటినంక బోడి మల్లన్న’
‘బీజేపీ అభ్యర్థిని నమ్మితే నీళ్లు లేని బాయిలో పడ్డట్టే..
జగ్గారెడ్డి : కేసీఆర్ బాధ..రైతులకు కరెంట్ లేదని కాదు.. తనకు పొలిటికల్ పవర్ లేదని..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి : కారు కార్ఖానాకు.. సారు దవాఖానకు..
.. ఇలాంటి సెటైర్లు పొలిటికల్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రచార సభలు హోరెత్తుతున్నాయి. జనం రావడాన్ని చూసి లీడర్లు తమ పంచులతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. జనం సైతం ఆ సెటైర్లను ఎంజాయ్ చేస్తున్నారు.