నిర్మల్ పట్టణంలో పిడుగుపాటు
Lightning strikes create panic in Nirmal town: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు భయపడుతున్నారు. వారం రోజుల్లో వరుసగా మూడు నాలుగు చోట్ల పిడుగులు పడడంతో ప్రజలు వర్షం వస్తుందంటే చాలు ఇళ్లకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన పిడుగు ప్రమాదాల్లో ప్రాణ నష్టం,పశు నష్టం కూడా జరిగింది. సోమవారం మామడ మండలం కొరటికల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై పిడుగు పడడంతో ఆలయ శిఖరం ధ్వంసం అయింది. తాజాగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని ముఠాపూర్ రవి ఇంటిపై పిడుగుపడడంతో ఇల్లు స్వల్పంగా ధ్వంసం అయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇంటి యజమానులు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నడూ లేని విధంగా పట్టణ నడిబొడ్డున పిడుగులు పడడం పట్టణ వాసులను భయాందోళనకు గురిచేస్తుంది.