Environmental clearances mandatory for development works in Nirmal district: అభివృద్ధి పనుల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె జిల్లా సర్వే రిపోర్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రానున్న రోజుల్లో చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు, రోడ్లు, గనులు, నీటిపారుదల పనులు, అటవీ అభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు వంటి శాఖల్లో చేపట్టే పనులకు అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని, ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అనుమతుల సమస్యల వల్ల పనులు నిలిచిపోకుండా, ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పనుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా సర్వే రిపోర్ట్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.