Indiramma housing scheme progress in Nirmal district
Indiramma housing scheme progress in Nirmal district

Indiramma housing scheme progress in Nirmal district: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Indiramma housing scheme progress in Nirmal district: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం సాయంత్రం సోన్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మార్క్ అవుట్, బేస్ మెంట్, తదనంతర నిర్మాణ దశలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 30లోపు అనుమతులు పొందిన అన్ని ఇళ్లకు మార్కౌట్ ప్రక్రియ పూర్తి చేసి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిరంతరం ఇళ్ల నిర్మాణంపై పర్యవేక్షణ చేయాలని, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్, నిబంధనల ప్రకారం ప్రతి దశకు సంబంధించిన ఫొటోలు సంబంధిత వెబ్‌సైట్‌లో సమయానికి అప్‌లోడ్ చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను కలెక్టర్ వెల్లడిస్తూ, తెలంగాణ ప్రభుత్వం పేదలకు గృహాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 9,161 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.(ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, పీవీటీజీలకు ప్రత్యేకంగా) ఇందులో 60 శాంతం మార్క్ అవుట్లు పూర్తవగా, 50 శాతానికిపైగా ఇళ్లు బేస్‌మెంట్ స్థాయి వరకు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 24 కోట్ల 68 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు.

అదనపు ఆర్థిక సహాయం కావలసిన వారికి స్వయం సహాయక సంఘాలు దాదాపు రూ.3 కోట్లు రుణాలు అందిస్తున్నాయని తెలిపారు. గత 45 రోజుల్లో 20 రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ, ప్రస్తుతం లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఇండ్ల నిర్మాణాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సమీప ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలని, లబ్ధిదారులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. ఎటువంటి వదంతులు, తప్పుడు సమాచారం నమ్మవద్దని, వేగవంతంగా నిర్మాణాలను పూర్తి చేస్తే, చెల్లింపులు క్రమంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవో సురేష్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *