- ఆదిలాబాద్ కవులకు అందని అవార్డులు
- మొదటి నుంచి ఆదిలాబాద్‌కు అన్యాయం
- ప్రముఖ కవి, వైద్యులు దామెర రాములు
Awards denial for Adilabad poets: కవులు, కళాకారుల పట్ల ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వివక్ష స్వరాష్ట్రంలోనూ కొనసాగుతోందని ప్రముఖ కవి, వైద్యులు దామెర రాములు అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమాలకు పురిటి గడ్డగా పేరుగాంచిందని, కవులు, కళాకారులు, ఉద్యమకారులకు పుట్టినిల్లుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాను విస్మరించడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో నిర్మల్ జిల్లాకు చెందిన కవులు కళాకారులు ఎన్నో ఉద్యమాలను చేపట్టి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ అన్యాయం జరగడం తమను కలిచి వేస్తోందని డాక్టర్ దామెర రాములు ఆవేదన వ్యక్తం చేశారు.
అవార్డుల ఎంపికలో అక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా కవులు, కళాకారులకు ఇచ్చే అవార్డుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని డాక్టర్ దామెర రాములు ఆరోపించారు. దశాబ్దాల కాలం పాటు వివిధ అంశాలపై అనేక పుస్తకాలను ప్రచురించిన అనుభవజ్ఞులైన కవులు ఉన్నప్పటికీ ఇటీవలే వచ్చిన కొందరిని గుర్తించి అవార్డులు ఇవ్వడం అన్యాయమని అన్నారు.
పైరవీలతో పురస్కారాలు
కవులు, కళాకారులను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభ ఆధారంగా పురస్కారాలకు ఎంపిక చేయాల్సి ఉండగా వాటన్నింటినీ పక్కనపెట్టి పైరవిలకు ప్రాధాన్యతనిస్తున్నారని ప్రముఖ కవి, డాక్టర్ దామేర రాములు అన్నారు. ఇటీవల కవులుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి గద్దర్, దాశరథి, కాళోజీ అవార్డులతో సత్కరించడం, దశాబ్దాలుగా కవిత్వ రంగంలో కొనసాగుతున్న వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. పైరవీలతో పురస్కారాలను పొందే మనస్తత్వం తమది కాదని అన్నారు. అవార్డులు, పురస్కారాలతో కవులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఈ విషయాన్ని పెద్దలు గుర్తించాలని అన్నారు.
అభివృద్ధిలోనూ అన్యాయం
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధిలోనూ తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని అనేక పరిశ్రమలు మూతబడిపోయాయని, నేటికీ ఈ ప్రాంత ప్రజలు రైలు కూతకు నోచుకోలేదని డాక్టర్ దామెర రాములు అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే నాయకులు చుట్టపు చూపుతో వచ్చి పోయేవారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేసినవారు లేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవులు, కళాకారులను గుర్తించడంతోపాటు జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ కవులు డాక్టర్ కృష్ణంరాజు, నేరెళ్ల హనుమంతు, నాగారం, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.
