- యూరియా బస్తాల కోసం రైతుల బాధలు
- నిలిచిపోయిన పంటల ఎదుగుదల
- చిట్యాలలో రైతుల పాట్లు
Urea shortage troubles farmers in Nirmal: ఎన్నడూ లేని విధంగా రైతులు యూరియా బస్తాల కోసం నానా తిప్పలు పడుతున్నారు. గతంలో యూరియా సంచుల కోసం ఎన్నడూ ఇంత గోస పడలేదని రైతులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైతుల అవసరం మేరకు యూరియా బస్తాలను తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు.
పంట ఎదుగుదలపై ప్రభావం
యూరియా కొరతతో పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వేయాల్సిన ఎరువులను ఆ సమయంలో వేస్తేనే సరైన దిగుబడులు వస్తాయని, లేనిపక్షంలో పంట ఎదుగుదల నిలిచిపోయి దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నా యూరియా లభించడం లేదని, ఒకపక్క అధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ మరి యూరియా ఎందుకు లభించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆధార్కార్డుతో యూరియా పంపిణీ
పంటలకు యూరియా దశలవారీగా అవసరం ఉంటుంది. అయితే పట్టా పాస్ బుక్కు ఆధారంగా యూరియా పంపిణీ చేసినట్లయితే కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం లేదు. అలా కాకుండా ఆధార్ కార్డు ద్వారా యూరియాను పంపిణీ చేయడం వల్ల ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు వారికి అవసరమైన దానికన్నా ఎక్కువ యూరియా బస్తాలను తీసుకుంటున్నారు. మరికొందరు అవసరం లేకున్నా ఆధార్ కార్డుపై యూరియా బస్తాలను తీసుకుపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్పష్టం అవుతుంది. గతంలో ఎప్పుడైనా పట్టా పాస్బుక్ ఆధారంగానే రైతులకు అవసరమైన మేరకు యూరియా బస్తాలను పంపిణీ చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆధార్ కార్డుపై యూరియా పంపిణీ చేయడం వల్ల లేని సమస్య ఏర్పడుతుంది.
వర్షంలో యూరియా కోసం పడిగాపులు
నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో శుక్రవారం ఉదయం వర్షం పడుతున్నా రైతులు యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద వేచి ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి క్యూలో ఉన్న రైతులకు సుమారు 10 గంటల సమయంలో 400 బస్తాలు వచ్చినట్లు సమాచారం. వెయ్యి మంది రైతులు బస్తాల కోసం లైన్‌లో ఉండగా వచ్చిన 400 బస్తాలు ఎటూ సరిపోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని, కనీసం సకాలంలో యూరియా అందించలేని స్థితిలో ఉండడం బాధాకరమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.