లబోదిబోమంటున్న బాధితులు
Fraud: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 8 (మన బలగం): జగిత్యాల పట్టణంలోని ఓ ఇంటికి అతనో అల్లుడు. చుట్టపు చూపుగా వస్తూ స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఆ పరిచయాల ఆధారంగా ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద కోటి రూపాయల వరకు, ముద్ర లోన్లు ఇప్పిస్తానంటూ దాదాపు మూడు కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్లు జగిత్యాల టౌన్ పోలీసులకు అందిన ఫిర్యాదు ద్వారా వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని ప్రాంతానికి చెందిన ఓ ఇంటి అల్లుడు మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన వేణు వర్మ ఘన కార్యమిది. జగిత్యాల జిల్లా పరిధిలోని దాదాపు వంద మంది ఈ ఫ్రాడ్‌లో భాదితులుగా వెలుగులోకి వస్తున్నారు. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ నుంచి దాదాపుగా రెండు కోట్లు ఇచ్చి మోసపోయినట్లు తెలిసింది. ఇలాగే మరెందరో రుణాల ఆశతో వేణు వర్మ అడిగినంత ఇచ్చుకొని పోలీస్ కేసు పెడితే పైసలు రావు అనే అనుమానంతో కేసులు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. లోన్ల ఆశతో మోసపోయిన భాదితుల సంఘటన జగిత్యాల వ్యాపించి చర్చనీయంశంగా మారింది.
డయల్ 100తో స్పందించిన పోలీసులు
అత్తవారింటి వద్ద వేణు వర్మను భాదితులు పక్కా సమాచారంతో పట్టుకొన్నారని ఓ వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేయగా స్పందించిన టౌన్ పోలీసులు వేణు వర్మను బాధితులను ఠాణాకు తరలించారు. ఇదే తరహాలో పోలీసుల స్పందన దర్యాప్తులో కొనసాగితే బాధితులకు న్యాయం దొరకడం ఖాయమని స్థానికంగా వినిపిస్తోంది.