Literacy Day: విద్యార్థులంతా కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని స్థానిక సంస్థల నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జుమ్మేరాత్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు అధికారులకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు.
విద్యార్థులతోపాటు నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. విద్య వల్ల మనిషి ప్రయోజకుడిగా మారుతాడని వివరించారు. విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని తెలిపారు. పలు నీతి కథల ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపారు. అనంతరం వారోత్సవ కార్యక్రమాలలో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసి, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో డి.భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్, ఎంఈవో నాగేశ్వర్ రావు, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.