Child death due to alleged medical negligence in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సదరు బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. అయాన్ అనే 18 నెలల బాలుడు జ్యరం వచ్చి బాధతుండటం పడడంతో మూడు రోజుల కింద పట్టణంలోని మెడికేర్ ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులు వైద్యం చేసిన వైద్యులు చివరి సమయంలో బాలున్ని ఇక్కడ కాదని చేతులెత్తేశారు. వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మార్గమధ్యంలో మృతి చెందాడు. కోపోద్రేకులైన బాలుని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.