వింత పోకడల అధికారులపై చర్యలు తీసుకోండి
Complaint to RJD: జగిత్యాల, అక్టోబర్ 18 (మన బలగం): స్కూల్ కాంప్లెక్స్ సబ్జెక్టు టీచర్ల సమావేశంలో, పీఆర్టీయూ సమావేశల్లో అధ్యక్షున్ని డీసీఈబీ సెక్రటరీ సన్మానించడం, జిల్లా సైన్స్ అధికారి తీరు, ఇద్దరు ఎంఈవోల తీరు ఆక్షేపనీయకంగా ఉందని, వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని యూఎస్‌పీసీ నాయకులు శుక్రవారం వరంగల్ ఆర్‌జేడీకి అందజేసిన వినతిపత్రంలో కోరారు. జిల్లాలో ఇటీవల జరిగిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశంలో జగిత్యాల రూరల్, గొల్లపల్లి మండల విద్యాధికారులు, జిల్లా డీసీఈబీ సెక్రటరీ, జిల్లా సైన్స్ అధికారి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాడ్జీలు, సంఘం కండువాలు ధరించి పాల్గొన్నారని వెల్లడించారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్ కాంప్లెక్స్ సబ్జెక్టు ఉపాధ్యాయుల సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన వ్యక్తిని డీసీఈబీ సెక్రటరీ మనోహర చారి ప్రభుత్వ శిక్షణ కార్యక్రమంలో సన్మానించడం నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు విద్యారంగంలో పెను పోకడలకు దారి తీస్తాయని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూఎస్‌పీసీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు తీరుకోవెల శ్యామ్ సుందర్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డి, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల శంకర్ బాబు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల రామచంద్రం, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్ పాల్గొన్నారు.