Friendship Bangles Festival celebrated in Khanapur during Vinayaka Navaratri: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో గురువారం వినాయక నవరాత్రుల సందర్భంగా మహిళలు ఫ్రెండ్‌షిప్ గాజుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి మండలాల్లోని దేవాలయాల్లో, వినాయక మండపాల వద్ద మహిళలందరూ కలిసి ఈ ఫ్రెండ్స్‌షిప్ గాజుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలోని గణేశ్ నవరాత్రులను పురస్కరించుకొని శాంతినగర్, శ్రీరాంనగర్, శాంతినగర్ నల్లపోచమ్మ ఆలయం దగ్గర, వివిధ కుల సంఘాల వద్ద సంబురాలు చేసుకున్నారు. కొత్త గాజులు ధరించి వేడుకలు చేశారు. ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఒకరికి ఒకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకొని నూతన వస్త్రాలను ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

