Distribution: నిర్మల్, జనవరి 23 (మన బలగం): విద్యార్థులు పాఠశాల స్థాయిలో కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదగాలని స్థానిక సోమవార్‌పేట్ కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవార్‌పేట్‌లో దాత విజయలక్ష్మి సహకారంతో పదో తరగతి విద్యార్థునులకు ఆల్ ఇన్ వన్ లాంటి అభ్యాస దీపికలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివే లక్ష్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారని అన్నారు. ఇష్టంతో చదివినప్పుడే దానిపై మక్కువ ఏర్పడి మంచి మార్కులు సంపాదించవచ్చునన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థిని అయిన విజయలక్ష్మి ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ లాంటి అభ్యాస దీపికలను అందజేశారు. అలాగే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు జాప వినోద ఇంగ్లీష్ విషయానికి సంబంధించిన మెటీరియల్‌ను విద్యార్థినులకు అందజేశారు. అనంతరం కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూడారపు పరమేశ్వర్, ఉపాధ్యాయులు సయ్యద్ జాఫర్, గౌసొద్దీన్, మనోహర్ రెడ్డి, ప్రేమల, ఉజ్మా సుజాత తదితరులు పాల్గొన్నారు.