Savitribai Phule Jayanti: కరీంనగర్, జనవరి 3 (మన బలగం): భారతదేశంలో అణగారిన పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అక్షరాలు నేర్పిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు, అభ్యుదయవాది, సంఘ సేవకురాలు సావిత్రిబాయి ఫూలే అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే స్త్రీల అభివృద్ధి అని నమ్మి బాలికల కోసం దేశంలో మొదటి పాఠశాలను ప్రారంభించిన వీర వనిత సావిత్రిబాయి ఫూలే అని, మహారాష్ట్రలోని సతరాజిల్లా ఖండాల తాలూకా నయాగం గ్రామంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జన్మించారని, 9 సంవత్సరాల వయస్సులో జ్యోతిరావు ఫూలేను 1840 సంవత్సరంలో వివాహం చేసుకొని నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెకు భర్త మొదటి గురువుగా మారి ఆమెకు అక్షరాలు నేర్పడంతో అట్టడుగు వర్గాల మహిళలకు చదువు చెప్పేందుకు ఆమె ఎంతగానో కృషి చేసిందని అన్నారు.
స్త్రీలను చైతన్య పరచడానికి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిందని దేశంలో మహిళలు సావిత్రి బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారినిగా ఉపాధ్యాయురాలిగా, సంఘసంస్కర్తగా, రచయిత్రిగా సావిత్రిబాయి అనేక రూపాలలో ప్రజలకు సేవ చేసిందని, లక్షలాదిమంది అమ్మాయిలు చదువు ద్వారా తమ జీవితాలను మార్చుకుంటున్నారంటే అందుకు కారణం సావిత్రిబాయి అని నాడు ఆమె ప్రారంభించిన విద్యా ఉద్యమమే నేడు దేశానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. అడుగడుగున అవాంతరాలను అడ్డంకులను ఎదుర్కొని సావిత్రిబాయి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.