Savitribai Phule Jayanti: నిర్మల్, జనవరి 3 (మన బలగం): ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు.
అస్పృశ్యత, అంటరానితనం, కులవివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఫూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆదిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వాటిని లెక్కచేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్పూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఏవో సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.