Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): గ్రూప్-3 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17, 18వ తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 8124 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే ప్రాథమిక చికిత్స అందించడానికి వీలుగా పరిక్ష కేంద్రాలలో వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.
పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు సమయానికి చేర్చేందుకు వీలుగా ఆయా రూట్లలో సరిపడా ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో రవీందర్ రెడ్డి, పరీక్షల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి గంగారెడ్డి, డిఎంహెచ్ఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ ఖమర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.