Former Minister Koppula Ishwar: ధర్మపురి, జనవరి 3 (మన బలగం): జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరించడానికి 2016లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పావు టీఎంసీ నుంచి ఒక టీఎంసీ వరకు దీని సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. ఇలా పెంచడం ద్వారా దాదాపు 17 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందుతోందని వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గంలోని కొమ్మునూరు, మంగెల, బోర్నపల్లి, ధర్మపురి నియోజకవర్గంలో ఆరెపెల్లి నుంచి వెల్గటూర్ మండలం ముత్తునూరు వరకు తమ ప్రభుత్వంలోనే 14 లిఫ్టులు ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ లిఫ్టుల ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని ఏనాడూ ఆలోచన చేయలేదని మండిపడ్డారు. 2016లో ప్రాజెక్టు వ్యయం 60 కోట్ల నుంచి 136 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఫౌండేషన్ డెప్త్ పెరిగిందని తెలిపారు.
జీఎస్టీ 5% నుంచి 18% పెరిగిందని వివరించారు. ల్యాండ్ అక్యువేషన్ ధర సైతం పెరిగిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో భారీ వర్షాలతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుందని కాంగ్రెస్ పాలకులు ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గోదావరి పొడవునా అనేక లిఫ్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసామని వివరించారు. గోదావరి నది మీద జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో దాదాపు 20 లిఫ్టులు ఉన్నాయని, ఒక్కో లిఫ్ట్ ద్వారా 2 వేల నుంచి 3 వేల వరకు సాగు నీరు అందుతోందని వివరించారు. రోళ్లవాగు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సరికాదని, దానిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరిలో నీళ్లను విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సాగి సత్యం రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకట మాధవరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.