Savitribai Phule Jayanti: ముధోల్, జనవరి 3 (మన బలగం): ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సంఘసంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రి బాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. అనంతరం సావిత్రి బాయి ఫూలే సేవలను కొనియాడారు. పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు విద్యార్థులు స్వయంగా బహుమతులను అందజేశారు. ప్రధానాచార్యులు సారథి రాజు మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రి బాయి ఫూలే గారి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు.