Collector Abhilasha Abhinav
Collector Abhilasha Abhinav

Collector Abhilasha Abhinav: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 18 (మన బలగం): పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 9129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకుగాను 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ పొట్లాలు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

పరీక్షలు జరిగే సమయాలలో కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని, 144 సెక్షన్ అమలు పరచి, పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రహరీ గోడలు లేని పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా పరీక్షల సమయానికి తగ్గట్లుగా ఆయా మార్గాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను రాయబోవు విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో మానసిక స్థైర్యం నింపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ పి. రామారావు, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డిఎంహెచ్ఓ రాజేందర్, విద్యుత్ శాఖ డిఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు పద్మ, లింబాద్రి, ప్రవీణ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Collector Abhilasha Abhinav
Collector Abhilasha Abhinav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *