నిర్మల్, జనవరి 21 (మన బలగం): పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలాని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షలపై సమీక్ష సంబంధిత శాఖల అధికారులతో సమావేశం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలలో మొత్తం 9127 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువడం జరిగిందని, ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు మధ్యంతర సన్నద్ధ పరీక్షలు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ లలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిరంతరం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని పరీక్షలకు సన్నద్దo చేయాలనీ సూచించారు.
ప్రతి పాఠశాలలో ఈ నెల చివరి నాటికీ 10వ తరగతి సిలబస్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులను మానసికంగా దృఢంగా చేసి పరీక్షలపై భయాన్ని తొలగించాలని, పాఠాలను సులభంగా గుర్తుంచుకునే విధంగా మెలుకువలు నేర్పించాలన్నారు. సబ్జెక్టుల వారిగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులచే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి విద్యార్థి తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. అనంతరం పాఠశాలల వారిగా పదవ తరగతి విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు పూర్తి చేసిన సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పరీక్షలకు సన్నద్ధమవుతున్న వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డిఈఓ పి. రామారావు, సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, అంబాజీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ లు పద్మ, సలోమి కరుణ, ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
