Local for vocal: నిర్మల్, డిసెంబర్ 23 (మన బలగం): మహిళలు అన్ని రంగాల్లో స్వశక్తితో ఎదగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లోకల్ ఫర్ వోకల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడీఐఐ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు మండలాల స్వయం సహాయక సంఘ మహిళలు చేతివృత్తులు, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల తయారీ, ప్యాకింగ్‌పై శిక్షణను పూర్తి చేసుకొని వారు తయారు చేసిన వస్తువుల స్టాళ్లను రిబ్బన్ కత్తిరించడం ద్వారా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలపడాలని తెలిపారు. మహిళా స్వయం సంఘాలలో చేరడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చునని తెలిపారు.
పొదుపు ఆవశ్యకతను మహిళలకు కలెక్టర్ వివరించారు. మహిళలు శిక్షణను పూర్తి చేసుకొని తయారు చేసిన వస్తువులను ఒకచోట అమ్మేందుకు వీలుగా తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి నాణ్యవంతంగా ఉన్నాయని అభినందనలు తెలియజేశారు. మహిళా స్వయం సంఘాల ఉత్పత్తులు కేవలం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సప్లై చేసే విధంగా ఎదగాలన్నారు. మహిళా స్వయం సంఘాలకు శిక్షణను ఇచ్చిన ఈడిఐఐ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వాలు మహిళల ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగపరుచుకొని అన్ని రంగాలలో ఉన్నతంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, నిర్మల్ పట్టణ తహసిల్దార్ రాజు, సీడీపీవో నాగమణి, లక్ష్మణచందా ఎంపీడీవో రాథోడ్ రాధ, ఈడీఐఐ ప్రాజెక్టు అధికారి భూపతి, మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.