Arattu Utsavam
Arattu Utsavam

Arattu Utsavam: కన్నుల పండువగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

శరణుఘోషతో పులకించిన గోదావరి తీరం
Arattu Utsavam: నిర్మల్, డిసెంబర్ 22 (మన బలగం): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయమైన సోన్ మండలం కడ్తాల్ గ్రామ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఆరట్టు ఉత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప భక్తుల సంకీర్తనలు, నృత్యాల మధ్య సోన్ గ్రామ సమీపంలోని గోదావరి నది తీరానికి పాదయాత్రగా పల్లకి సేవను తీసుకెళ్లారు. నదిలో స్వామివారికి పువ్వులు, నదీజలం, పంచామృతంతో అభిషేకం చేసి ప్రత్యేక హారతినిచ్చారు. భక్తుల అయ్యప్ప శరణుఘోషతో గోదావరి తీరమంతా మార్మోగింది. అనంతరం ఆలయానికి చేరుకుని ఉంజల్ సేవ నిర్వహించారు. కౌట (బి) గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి గురుస్వామి శిష్య బృందం ఆలపించిన అయ్యప్ప భక్తి గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవంలో జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నయనానందంగా అలంకార ప్రియుడి అభిషేకం
ఆరట్టు ఉత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి నిర్వహించిన వివిధ రకాల అభిషేకాలు భక్తులను నయనానందం కలిగించాయి. పవిత్ర గోదావరి జలం, వివిధ రకాల పుష్పాలు, పాలు, కొబ్బరి నీళ్లు, తేనె, చక్కెర, విభూతి, గంధంతో జరిగిన అభిషేకాలు, అయ్యప్పనామ సంకీర్తనలు, విశేషపూజల నడుమ భక్తులంతా తన్మయత్వం పొందారు.

Arattu Utsavam
Arattu Utsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *