ఎమ్మెల్సీ కోదండరాంతో సహా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన పీఆర్టీయూ తెలంగాణ నేతలు
PRTU Telangana: మన బలగం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఎమ్మెల్సీ కోదండరాం, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని గురువారం కలిసి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు నివేదించారు. గురుకుల పాఠశాలల సమయాన్ని మార్చుతూ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు అమలు చేయాలని కోరారు. అన్ని గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి 010 ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు చెల్లిస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలు చేయాలన్నారు.
అన్ని గురుకుల పాఠశాలల్లో హాస్టల్ వార్డెన్ పోస్టులను విధిగా మంజూరు చేయించాలన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు, కేజీబీవి ఉద్యోగులు విద్యారంగానికి ఎన్నో సంవత్సరాలుగా విపరీతమైన కృషి చేస్తున్నారని, వారికి మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చాలా రాష్ట్రాలలో సీపీఎస్ విధానం రద్దు చేసారని, తెలంగాణలో కూడా సీపీఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.రాష్ట్రంలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులను, పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఇతర ఉపాధ్యాయుల వలె సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు కేవలం వేతనం పైన మాత్రమే ఆధారపడే కుటుంబాలని, కావున వారు పొదుపు చేసి దాచుకున్న జీపీఎఫ్ సరెండర్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ లాంటి పెండింగ్ ఆర్థిక బిల్లులను ఎప్పటికప్పుడు వారి ఖాతాలలో జమ చేసేటట్టు ఆర్థిక శాఖను ఆదేశించగలరని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూషన్‌గా తీసుకొని ఎంప్లాయిస్ హెల్త్ స్కీం సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు.ఐటీడీఏ పాఠశాలల్లో కూడా 1806 మంది ఉపాధ్యాయులు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని, వారందరిలో చాలామందికి ఉద్యోగ వయోపరిమితి దాటిపోయిందని, మానవీయ దృక్పథంతో వారందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని విన్నవించారు. సుమారు 40 సంవత్సరాల నుంచి 398 స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ కొరకు నిరీక్షిస్తున్నారని, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారని, కావున మన రాష్ట్రంలోనూ ఇవ్వాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57/4, 57/5 మెమోలను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను ప్రభుత్వమే నేరుగా చేపట్టాలని, ఏజెన్సీలను రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఏజెన్సీలు ఎక్కువ డబ్బులు తీసుకుంటూ వేతనాలు సరిగా చెల్లించడం లేదన్నారు. విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ తెలిపారు.