MLA Laxman Kumar: ధర్మపురి, జనవరి 10 (మన బలగం): ఎస్సీ నియోజకవర్గమైన ధర్మపురికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ విద్యాసంస్థను ఇక్కడ రద్దుచేసి ఇతర ప్రాంతానికి తరలించొద్దని ఎంపీ అరవింద్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కోరారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 10 రోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ అరవింద్ నవోదయ విద్యా సంస్థ పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలో వద్దు అని నిజామాబాద్ పార్లమెంటుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత కూడా దాన్ని తరలించాలని చూడటం న్యాయమా? అని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ విశాల హృదయంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఎంపీ అరవింద్‌ను, సంబంధిత నవోదయ కేంద్ర శాఖ అధికారులను కలిసి వివరించి వినతిపత్రం ఇస్తానన్నారు. నవోదయ సంస్థ అంశంలో తనకు ఎలాంటి భేషజాలు లేవు, ఈ అంశంపై ప్రధాన మంత్రికి ఉత్తరం రాస్తాను, అపాయింట్‌మెంట్ దొరికితే తప్పకుండా వారిని కలుస్తానని అన్నారు. ఈ అంశంలో తప్పకుండా ఎంపీ అరవింద్ సానుకూలంగా స్పందిస్తారని తాను భావిస్తున్నట్టు ఎమ్మెల్యే అన్నారు.
నవోదయ విద్యాలయం అంశంలో సానుకూల స్పందన రాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానని తెలిపారు. విద్యార్థులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు. నవోదయ విద్యాసంస్థ విషయంలో ఎక్కడా వెనుకను తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్‌లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసినట్లు తెలిపారు. దానికి సంబంధించి నేరేళ్ళ వద్ద సర్వే నెంబర్ పూర్తి స్థాయిలో నక్షతో సహా రాష్ట్ర విద్యశాఖకు పంపించామన్నారు. కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ పాఠశాలలు మంజూరు చేసిందని, దానికి సంబంధించి ధర్మపురిలోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇచ్చిందని తెలిపారు. నేరెళ్లలో నూతన నవోదయ భవన నిర్మాణం జరిగే వరకు ధర్మపురిలో అన్ని వసతులతో నూతనంగా నిర్మితమైన ఎస్టీ హాస్టల్ భవనంలో ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని నిర్ణయించామన్నారు. భవనానికి సంబంధించి నవోదయ విద్యాలయ అధికారులు వచ్చి చూశారని, అన్ని త్వరలో తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.