- మహా శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలి
- ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
- ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించాలి
- ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు జాతర నిర్వహణ
- భక్తుల నుంచి ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు చేయాలి
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10 (మన బలగం): అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహా శివరాత్రి జాతర వేడుకలు విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈవో, ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి సోమవారం కలెక్టర్ జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్, సీసీటీవీల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మహా శివరాత్రి జాతర వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఫోన్ సిగ్నల్స్ సమస్య దృష్టిలో ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవర్ల ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ డిపోల నుంచి మొత్తం 857 బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. 20 లక్షల లీటర్ల నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 500 మంది పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పేర్కొన్నారు. 8 అగ్నిమాపక వాహనాలు, ఇప్పటికే 260 సీసీ కెమెరాలు ఉండగా మరో 180 కెమెరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. 24 మంది గజఈత గాళ్లు సేవలు అందిస్తారని అధికారులు వివరించారు. 3 లక్షల లడ్డూలు ప్రసాదం సిద్ధంగా పెట్టనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. జాతర సందర్భంగా గుడి చెరువు ప్రాంతంలో భక్తులకు అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, వేములవాడ పట్టణానికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయాలని, రోడ్డుకు ఇరు వైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జాతర విధులు నిర్వహించడానికి వచ్చే సిబ్బందికి, ముఖ్య అతిథులకు వసతి సౌకర్యం కల్పించాలని అన్నారు. భక్తుల కోసం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పందిరి దగ్గర అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.
జాతర సందర్భంగా వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ చలి వేంద్రాలను, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరాలలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్‌లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ల వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్, జగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర అవసరమైన హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. మహా జాతర జరిగే సందర్భంగా మద్యం అమ్మకాలను వేములవాడ పరిసరాలలో నిషేధించాలని అన్నారు. మహాశివరాత్రి జాగారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ గతం కంటే అధికంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, అక్కడ పోలీసుల కోసం టెంట్, తాగు నీటి సరఫరా ఉండాలని అన్నారు. తిప్పాపూర్ చౌరస్తా దగ్గర సాయంత్రం ఉండే మార్కెట్ జాతర సమయంలో ఉండకుండా ముందస్తు సమాచారం సంబంధిత వ్యాపారులకు అందజేయాలని ఎస్పీ మున్సిపల్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈ.ఓ వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
