National Voter’s Day: నిర్మల్, జనవరి 25 (మన బలగం): విద్యార్థులు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అని తెలిపారు. భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతను నాటికల రూపంలో ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను కలెక్టర్, అధికారులు అభినందించారు. సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధ ఓటర్లను, ట్రాన్స్ జెండర్, మహిళ, నూతన యువ ఓటర్లను శాలువాతో సన్మానించి పూల మొక్కలను అందజేసి అభినందించారు. వీరందరూ ఓటర్లందరికి ఆదర్శమని తెలిపారు. సంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్న విద్యార్థులందరికీ అదనపు కలెక్టర్లతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఈఓ పి. రామారావు, డిఎంహెచ్ఓ రాజేందర్, సిపిఓ జీవరత్నం, వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ట్రాన్స్ జెండర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
