Former MLA Narayana Rao Patel: ముధోల్, జనవరి 4 (మన బలగం): నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లో శనివారం మహాలక్ష్మి టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముధోల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సహకారంతో రూ.80 లక్షలతో సంవత్సర కాలంలోనే సీసీ రోడ్డు, డ్రైనేజీలను మంజూరు చేయించామన్నారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ఇచ్చిన మాట నెరవేర్చడానికి సీసీ రోడ్డు, డ్రైనేజీని మంజూరు చేసి నాణ్యతతో పనులు పూర్తి చేయించానని తెలిపారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందినా ముధోల్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ ఎంపీ గెలిచినా ముధోల్‌కు అభివృద్ధి జరగలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోనే ముధోల్ అభివృద్ధి చెందిందని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కొందరు నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ముధోల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మహాలక్ష్మి టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ను మాజీ ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. సీసీ రోడ్డుకు సక్రమంగా క్యూరింగ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఎజాజొద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, యూత్ అధ్యక్షుడు దుడ్డు ప్రసాద్, నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పతంగి కిషన్, రావుల శ్రీనివాస్, అజీజ్, ఖాలిద్ పటేల్, ఇమ్రాన్ ఖాన్, దిగంబర్, శంకర్ చంద్రే, బోజరాం పటేల్, నజీమ్, షమీమ్, తదితరులు పాల్గొన్నారు.