Nirmal Rain: నిర్మల్ పట్టణం మరోసారి జలసంద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా ఒక ఉక్కపోతతో సతమతమవుతున్న నిర్మల్ పట్టణ ప్రజలకు వర్షం తెరిపినిచ్చింది. అయితే గంట పాటు కురిసిన భారీ వర్షం ఫలితంగా నిర్మల్ పట్టణం జల సంద్రంగా మారిపోయింది. నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ మోకాలి లోతు నీళ్లలో మునిగిపోయాయి. ప్రధానంగా 44 నెంబర్ జాతీయ రహదారిపై శివాజీ చౌక్, డాక్టర్స్ లేన్ తదితర ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని శివాజీ చౌక్‌లో మోకాలిలోతు నీళ్లు నిండిపోయి పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లోపలికి వర్షపు నీరు ప్రవేశించింది. అలాగే కోర్టు ఎదుట రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.