Teachers lost in flood: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఇద్దరు ఉపాధ్యాయులు కొట్టుకు పోగా ఒకరు మృతిచెందారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకున్నది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగు పొంగి ప్రవహిస్తోంది. వాగు దాటొద్దని ఉపాధ్యాయులకు చెప్పినా.. తెలుగు అర్థం కాకపోవడంతో వాగుదాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాగు నీటిలో వారు కొట్టుకు పోయారు. ఉపాధ్యాయిని మృతదేహం లభించగా, మరో ఉపాధ్యాయుడి ఆచూకీ గల్లంతైంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ వసతి సరిపోక సరాయివలస గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతులు కొనసాగుతున్నాయి.
45 రోజుల కిత్రం హరియాణా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23), మహేశ్ ఇక్కడికి ఉపాధ్యాయులుగా చేరారు. వీరు గురివినాయుడుపేటలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. రోజూ మాదిరిగానే విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని రాయి మాను వాగు ఉధృతికి నీరు కాజ్‌వేపై నుంచి ప్రవహిస్తోంది. స్థానికులు వీరిని గమనించి, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. అయితే భాష అర్థంకాక ముందుకు రావడంతో వారిద్దరూ గల్లంతయ్యారు. కొంతసేపటికి ఆర్తి మృతదేహం దొరికింది. మహేశ్ ఓ చెట్టుకొమ్మను పట్టుకొని, ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా.. కొమ్మ విరిగి నదిలో పడి కొట్టుకుపోయాడు. ఈ సమాచారం అందుకున్న గిరిజనశాఖ మంత్రి సంధ్యా రాణి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులకు సూచించారు. అధికారులు గ్రామస్థుల సహకారంతో వాగు పొడవునా కిలోమీటరు మేర గాలించి ఆర్తి టీచర్ మృతదేహం, ఇసుకలో కూరుకుపోయిన ద్విచక్రవా హనాన్ని గుర్తించారు.