Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 3 (మన బలగం): ప్రతి దివ్యాంగుడికి యూడీఐడీ జారీకి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ (యూడీఐడీ)పై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిక్ డిసేబులిటీ ఐడీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేశారు. దివ్యాంగులకు వైద్యులచే ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరన్ సర్టిఫికెట్, వారి పూర్తి వివరాలు జనరేట్ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దృష్టి, కుష్ఠు వ్యాధి గ్రస్తులు, వినికిడి, అంగవైకల్యం, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి (యూడీఐడీ) కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నూతనంగా కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడీఐడీ జనరేట్ చేస్తారని వివరించారు. జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శుకు, విఓఏలు, సీసీలు, ఎంపీడీవోలు, ఏడీఎంలకు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రిలో యూ.డి.ఐ.డీ నిర్ధారణ ప్రక్రియ కోసం అవసరమైన వైద్యులు, పరికరాలు ఉండేలా చూడాలని, క్యాంపు అప్పుడు దివ్యాంగులకు కుర్చీలు, తాగు నీరు ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. నూతనంగా కావాల్సిన వస్తువుల ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. నూతనంగా యూడీఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రిలో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని, నిర్దారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడీఐడీ కార్డు జనరేట్ చేయాలని తెలిపారు. సమావేశంలో డి.ఆర్.డి.ఓ.శేషాద్రి, డి.డబ్ల్యూ.ఓ. లక్ష్మీరాజం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.