ఉత్సవాలను మరొక రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Festivals: నిర్మల్, జనవరి 7 (మన బలగం): నిర్మల్ ఉత్సవాలు 3వ రోజు పండగ వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగాయి. మంగళవారం సాయంత్రం ఉత్సవాలకు వేలాదిగా ప్రజలు పాల్గొని స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి కొనియాడారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించినందుకు కలెక్టర్ కు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లాకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చరిత్రను తెలియచెప్పిన వారమవుతామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధుల, జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజల ఉత్సాహం కోరిక మేరకు ఈ ఉత్సవాలను మరొక రోజు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నిర్మల్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఇతర అధికారులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
