The Collector inspected the Anganwadi Centre: నిర్మల్, నవంబర్ 23 (మన బలగం): అంగన్వాడీల్లోని చిన్నారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని నాయిడివాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు. అంగన్వాడీల్లో తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. చిన్నారులకు అధిక సంఖ్యలో ఆటవస్తువులు, బొమ్మలు అందుబాటులో ఉంచాలన్నారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంటకు నాణ్యమైన సరుకులను కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో స్వచ్ఛమైన తాగునీరు అందివ్వాలన్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. అంగన్వాడీ పరిసరాలలో దోమలు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రపరచాలన్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువును నేర్పించాలని తెలిపారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు.
చిన్నారుల తల్లిదండ్రులతో నెలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని సూచించారు. చిన్నారుల ఎత్తు, బరువు ఇతర వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యవంతమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో సున్నాలు వేయించి అన్ని వివరాలు తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశీలనలో సిడిపిఓ నాగమణి, తాహసిల్దార్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.