Mega Job Fair: ధర్మారం, నవంబర్ 16 (మన బలగం): పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమరథనం ట్రస్ట్ ఫర్ ది డిసబుల్ద్ అండ్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫండేషన్ హైదరాబాద్ సహకారంతో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకుల కోసం, శారీరక, మానసిక దివ్యాంగుల కోసం డేటా ఎంట్రీ, బీపీవో, రిటైల్, ఈ కామర్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటి, హోటల్ మేనేజ్‌మెంట్, ఆటోమోటివ్, వైద్య (ఫారమసీ), ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మెడ్‌ప్లస్, ఆక్సిస్ బ్యాంక్, పారడైజ్, బ్యుటీషియన్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. శనివారం స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించారు. తమ అర్హతలను బట్టి వివిధ ఖాళీలకు 200 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మామిడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతి యువకులు మత్తు పానీయాలకు, గంజాయి, సిగరెట్లు వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా టెన్త్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకొని పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు వారు ఎంపిక చేసుకున్న ఉద్యోగ సంస్థల మంచి చెడులు ఆలోచించుకొని ఉద్యోగంలో చేరాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు పెద్ద మొత్తంలో నిర్వహించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ క్లబ్ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ ఎలగందుల అశోక్, అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మహేందర్, కోశాధికారి తోడేటి మురళి గౌడ్, పీఆర్వో కందుల సతీశ్, ఉపాధ్యక్షులు బొల్లం మల్లేశం, బైరి చంద్రమౌళి, అమరపల్లి నారాయణ, వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేల్పుల కొమురయ్య, డైరెక్టర్స్ దేవి అంజయ్య, జిడుగు రాము, మెరుగు మల్లేశం, గంటాయి సతీశ్, కన్నం సతీశ్, అధ్యాపకులు మద్దునాల మల్లేశం, ఎండి రఫీక్, రత్నాకర్ రెడ్డి, కె.సతీశ్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.