Woman dies due to electric shock: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 26 (మన బలగం): ఉదయం ఇంటి పనుల కోసం బయటకు వచ్చిన గృహిణి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సిద్దాల బాలయ్య కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో తన ఇంటి చుట్టూ విద్యుత్ వైర్లను రక్షణ కొరకు ఏర్పాటు చేశారు. గురువారం వేకువ జామున తన భార్య రేణుక నిద్ర నుంచి లేసి ఇంటి పనుల నిమిత్తం ఇంటి వెనకాలకు వెళ్లగా విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగిలి షాక్కు గురై కింద పడిపోయింది. గమనించిన బాలయ్య గ్రామస్తులతో కలిసి ఆమెను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి కుమార్తె ప్రవళిక హైదరాబాద్లోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.