Farmers protest for urea shortage in Kadam, Nirmal district: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మళ్లీ మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రతి రోజు యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి కడెం పీఏసీఎస్ వస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కావాలని అధికారులని వేడుకుంటున్నారు. ఇక్కడకు వచ్చిన రైతులకు ఇవ్వకుండా, పైరవీలు చేసుకున్న వారికి ఇస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యూలో చెప్పులు
కడెం మండలం చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన వందల మంది రైతులు మంగళవారం యూరియా వచ్చి ఆందోళన చేశారు. పీఏసీఎస్ కార్యాలయం వద్ద తమ చెప్పులను క్యూలో పెట్టారు. రైతులు లైన్‌లో గంటల కొద్ది నిలబలేక ఇబ్బంది పడ్డారు. ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పులను వరుస క్రమంలో పట్టుకున్నారు. మునుపెన్నడు ఇంత దారుణ పరిస్థితి లేదని, యూరియా కోసం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని వాపోయారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు యూరియా దొరకకపోవడంతో తమ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు అవసరమైనంత యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు కోరారు. సకాలంలోనే పంటకు యూరియా వేయాలని, కాలం దాటిన తరువాత యూరియా వేసే లాభం లేదని రైతులు వాపోయారు.
