- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Special Officer Krishna Aditya: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించి దాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు అభిలాష అభినవ్, రాజార్శి షా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, శ్యామలాదేవిలతో కలిసి ఆయన అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు, సేకరించిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లోని వసతులు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్, తేమ, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, సన్న వరి ధాన్యం నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరి ధాన్యానికి సంబంధించి మద్దతు ధర, ఇతర వివరాలు తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యము వెంటనే కేటాయించిన మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు. ప్రతి గోదాంలో సిసిటీవీలను ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్టర్‌లను పకడ్బందీగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను అధికారులకు అందజేయాలన్నారు. ప్రత్యేక అధికారులంతా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా బ్యాంకర్లు గ్యారెంటీ కల్పించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 287 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
1 లక్ష 35 వేల ఎకరాలలో వరి ధాన్యం పండించినట్లు తెలిపారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరిపడినన్ని తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్లతో సహా 40 శాతం అధికంగా సన్న వరి ధాన్యం నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఇప్పటికే బ్యాంకు, రెవెన్యూ అధికారులు, రైస్ మిల్లర్లతో పలుమార్లు సమావేశం నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నామన్నారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, శ్యామల దేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ఆదిలాబాద్ శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎస్వో కిరణ్ కుమార్, డీఎం వేణుగోపాల్, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.