Fine Rice: నిర్మల్, మార్చి 22 (మన బలగం): ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల కోట నుంచి అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన శనివారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాలలో సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. ప్రజలెవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యాన్ని ఇవ్వవద్దు అన్నారు. సన్న బియ్యం జారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. వేసవికాలం ఎండలు అధికంగా ఉన్నందున్న రేషన్ దుకాణాలకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలుకు ఎండ నుంచి రక్షణ కల్పించేలా తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ డీఎం వేణుగోపాల్, డీఎస్‌వో కిరణ్ కుమార్, రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.