Flood prevention measures Nirmal: నిర్మల్ పట్టణంలో భవిష్యత్తులో వరదలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లేక్ ప్రొటెక్షన్‌పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. వరదల నియంత్రణలో సర్వే, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణంలో వరదలు సంభవించడానికి గల ప్రధాన కారణాలను గుర్తించి, వాటి నివారణకు శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, కాల్వలు, చెరువులు, నదీ వాగుల ప్రవాహ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే అవసరమైతే మాస్టర్ ప్లాన్ ఆధారంగా సవరణలు చేసి, శాశ్వత రీతిలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఏడీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ ఆర్. సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసిల్దార్లు రాజు, సంతోష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
