మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాక
Nagoba Jatara: ఇంద్రవెల్లి/నిర్మల్, జనవరి 24 (మన బలగం): రాష్ట్ర పండుగగా పేరుగాంచిన ఆదివాసీల కొంగుబంగారమైన కేస్లాపూర్ నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా దర్బార్ హాలులో నిర్వహించిన జాతర సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగోబా జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేయాలన్నారు. వచ్చే ఏడాది వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణకు కృషి చేస్తామన్నారు. రూ6కోట్లు మూడు రోజుల్లో కలెక్టర్ ఖాతాలో జమ అవుతాయన్నారు. కేస్లాపూర్ అభివృద్ధి కోసం రూ.13 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నాగోబా మహా జాతరకు తరలివస్తారని తెలిపారు. జాతరలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిశుభ్రతతో పాటు నీటి సౌకర్యం ముఖ్యమని తెలిపారు. జాతరలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, కరెంటు కోతలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జాతరలో వెలిసే తినుబండారాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా పెట్టాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బస్సులతోపాటు రాష్ట్రమంతా తెలిసేలా అన్ని బస్సులపై నాగోబా జాతరకు సంబంధించిన పోస్టర్లను పెట్టాలన్నారు. జాతరలో మత్తు పదార్థాలు రాకుండా ఎక్సైజ్ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలన్నారు. నాగోబా మహా జాతర 31వ తేదీన దర్బార్‌కు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు సీతక్కలతో పాటు పలువురు మంత్రులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పోలీస్ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వారం రోజులు పాటు జరిగే నాగోబా జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.