Whip Laxman Kumar: ధర్మపురి, డిసెంబర్ 23 (మన బలగం): ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు, అధికారులతో కలిసి సోమవారం ధర్మపురి పట్టణంలో పర్యటించారు. ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య నుంచి పాదయాత్రగా తీసుకువచ్చిన శ్రీరామ చంద్రుడి పాదుకలను దర్శించుకున్నారు. అనంతరం గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించి పారిశుధ్య పనులుపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి నదిలో డ్రైనేజీ నీరు కలవకుండా ఎస్టీపీ నిర్మాణానికి పరిపాలన అనుమతుల కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కూరగాయలు అమ్మే వారికి ఇబ్బందులు కలగకుండా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో ఉన్న గద్దెలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు వసతి విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గత పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయక పనులు అసంపూర్తిగా ఉండిపోయాయన్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బిల్లులు విడుదల చేయిస్థామన్నారు. మాత శిశు ఆస్పత్రి మిగులు పనులను పూర్తి చేయించి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ఆటో స్టాండ్ కోసం స్థలం కేటాయించేలా అధికారులకు సూచిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.