National Girl’s Day: నిర్మల్, జనవరి 24 (మన బలగం): బాలికలు జీవితంలో ఉన్నత స్థితిలో నిలిచేందుకు చిన్నతనం నుంచే ఉన్నత బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని రాంనగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌కు విద్యార్థులు బ్యాండు మేళాతో ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటామని ఈ ప్రత్యేకమైన రోజు సమాజానికి బాలికల పాత్ర ఎంత ముఖ్యమైందో గుర్తు చేస్తుందని తెలిపారు. బాలికలు కుటుంబాలకు వెలుగులు నింపే దీపాలు అని, వారి ప్రతిభ, కృషి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. అతిథులు, ఉపాధ్యాయులు, పాఠశాలల విద్యార్థులందరికీ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలకు సరైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వారిని కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించడం మనందరి కర్తవ్యం అని తెలిపారు. ఒక బాలిక చదువుకుంటే, ఒక్క కుటుంబమే కాదు, ఒక సమాజం విద్యావంతం అవుతుందన్నారు.
ప్రభుత్వం మహిళల సాధికారత కోసం బేటీ బచావో, బేటీ పడావో, సుఖన్య సమృద్ధి యోజన వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బాలికలకు ఇప్పటినుంచే ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు అనుగుణంగా కృషి చేయాలని తెలిపారు. క్రమశిక్షణతో ఉంటూ చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించాలని బాలిక విద్య ఆవశ్యకతను వివరించారు. దేశాభివృద్ధి ఆడపిల్లల చదువుతో ముడిపడి ఉందని తెలిపారు. విద్యతో పాటుగా పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 1098 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సూచించారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఏర్పాటు చేసిన సెల్ఫీ కేంద్రం వద్ద ఫొటోలు దిగారు. అధికారులు విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులంతా బాధ్యతగా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పి.రామారావు, డీటీడీవో అంబాజి, మెప్మా పీడీ సుభాష్, నిర్మల్ పట్టణ ఎంఈవో నాగేశ్వర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారాం, మిషన్ శక్తి సమన్వయకర్త సవిత, సీడబ్ల్యూసీ చైర్మన్ వాహీద్, సీడీపీవోలు, ఇతర అధికారులు, ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
