- రెసిడెన్షియల్ విద్యాలయాలు ఎలా ఉన్నాయి
- విద్యార్థులను ఆరా తీసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (మన బలగం): రెసిడెన్షియల్ విద్యాలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మెనూ పాటిస్తున్నారా? అని విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు పరిశీలించారు. అనంతరం కిచెన్, స్టోర్ రూమ్‌లో ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులు రివిజన్ చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా ఏఏ సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో నిత్యం చదవాలని పిలుపు నిచ్చారు. ప్రతి సబ్జెక్టులో వచ్చే సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సృజన, ఉపాధ్యాయినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.