Indiramma housing works speed up Nirmal: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు, మార్కౌట్, బేస్‌మెంట్ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నెల 30లోపు అనుమతులు పొందిన ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ప్రక్రియ పూర్తిచేసి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిరంతరం ఇళ్ల నిర్మాణంపై పర్యవేక్షణ చేయాలని, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి దశకు సంబంధించిన ఫోటోలను నిబంధనల ప్రకారం సంబంధిత వెబ్‌సైట్‌లో సమయానికి అప్‌లోడ్ చేయాలని తెలిపారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
