Illegal recruitment of backlog posts in Nirmal alleged by Telangana Unemployed JAC: నిర్మల్ జిల్లాలో దొడ్డి దారిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. గురువారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా దొడ్డి దారిలో భర్తీలు జరుగుతున్నాయన్నారు. అక్రమ దారిలో ఉద్యోగాలను కొనుక్కొని, సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపై అలాగే అక్రమంగా డబ్బులు తీసుకుని భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపై తాము పోరాటం చేస్తున్నామని వివరించారు. గత సంవత్సరం నుంచి హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా ధర్నాలు చేసి దొడ్డిదారి ఉద్యోగాలను ఆపేశామని తెలియజేశారు. అలాగే నిర్మల్‌లో దొడ్డి దారిలో ఉద్యోగాలు భర్తీ జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందన్నారు. గతంలో కూడా నిర్మల్ మున్సిపల్‌లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. దీనికి ఎంక్వైరీ కమిటీ అధికారిక ఆర్డీవోను నియమించి, ఉద్యోగాలలో జరిగిన అవకతవకల గురించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదన్నారు. 44 ఉద్యోగాలను అంగట్లో వేలం వేసి అమ్ముకున్నారని మండిపడ్డారు.
ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం ఉందన్నారు. 2018 సంవత్సరంలో జేన్‌కోలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా కాంటాక్ట్ ఒప్పందంపై ఉద్యోగాలను భర్తీ చేసి, 2022లో పర్మినెంట్ చేశారన్నారు. వీరి వద్ద నుంచి ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల దాకా డిమాండ్ చేసినట్టు సమాచారం ఉందన్నారు. ఇప్పటికే జేన్కోలో కరీంనగర్ మాజీ ఎంపీ సోదరుని కూతురికి ఎగ్జామ్ రాయకుండానే ఏఈ పోస్టు ఇచ్చినట్టు జెన్కో ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. నిర్మల్‌లోనూ కొన్ని శాఖల్లో దొడ్డిదారి ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పై అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దొడ్డిదారిన జరిగే బ్యాక్‌లాగ్ నియామకలను అడ్డుకొని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో విద్యార్థి నాయకులు కాశి, రాహుల్, సిద్ధార్థ, తదితరులు ఉన్నారు.
