Collector orders immediate marking for approved Indiramma housing in Nirmal: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతి ఇంటికి సంబంధించిన మార్క్ అవుట్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు దశల వారీగా నిరంతరంగా కొనసాగాలని స్పష్టం చేశారు. మార్క్ అవుట్, బేస్‌మెంట్ తదితర దశల్లో పూర్తయిన ఇండ్ల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మాన్‌పవర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మార్క్ అవుట్ పూర్తయ్యి ఇంకా పనులు ప్రారంభించని వారు ఉంటే వెంటనే నిర్మాణం మొదలయ్యేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులను గుర్తించి మహిళా సంఘాల ద్వారా రుణాలు కల్పించేలా చూడాలని, ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వేను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సర్వేను ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
