Albendazole Tablet Administration in Nirmal District: నిర్మల్ జిల్లాలో ఆగస్టు 11 సోమవారం నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 19 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి ముడారపు పరమేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, గురుకుల పాఠశాల మరియు కళాశాల, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు, సంక్షేమ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాల మొదలగు అన్ని విద్యాసంస్థలు భాగస్వామ్యం అయి తమ విద్యార్థులకు 100% ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని పేర్కొన్నారు.
ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని కార్యక్రమ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా నియమించాలని, ప్రతి తరగతి ఉపాధ్యాయులు, ఆ తరగతికి సంబంధించిన విద్యార్థులు అందరూ మాత్రలు వేసుకునేలా బాధ్యత వహించాలని కోరారు. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ మాత్రలు వేస్తున్నామనే సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయాలని, ఆగస్ట్ 11న విద్యార్థుల హాజరు శాతం 100% ఉండేలా చూసుకోవాలని, అందుకు తగిన విధంగా సమాచారాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు. ఏ విద్యార్థి అయినా 11వ తేదీన అందుబాటులో లేకపోతే లేదా అనారోగ్యంగా ఉంటే వారికి మాపప్ రోజు అయిన ఆగస్టు 18న తిరిగి మాత్రలు తప్పకుండా వేయాలని సూచించారు.
విద్యార్థులకు ఖాళీ కడుపున టాబ్లెట్ వేయకూడదని, అలాగే విద్యార్థులు మధ్యాహ్నము భోజనం చేసిన పిదప పది నిమిషాల సమయం తర్వాత టాబ్లెట్లు వేయాలని సూచించారు. మాత్రలు విద్యార్థులకు ఇచ్చి ఇంటికి పంపించవద్దని, విద్యార్థులు పాఠశాలలోనే మాత్రలు వేసుకునేలా చూడాలని, పారవేయకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులలో నూలి పురుగుల నిర్మూలనకు ఈ మాత్రలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టులో వేస్తున్నట్లు వివరించారు. ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు రావని, ఒకవేళ ఏవైనా సమస్యలు, వాంతులు కలిగితే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.