One year imprisonment: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 13 (మన బలగం): నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా హార్వెస్టర్‌ను నడిపి గాయాల పాలు చేసిన కేసులో నిందితుడు అర్ముళ్ల మధుసూదన్‌కు ఏడాది జైలు శిక్ష, 11 వందల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీనిజ కోహిర్కర్ గురువారం తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే 12 డిసెంబర్ 2019లో జగిత్యాల రూరల్ మండలంలోని మోతే గ్రామంలో అర్ముళ్ల మధుసూదన్‌కు చెందిన హార్వెస్టర్ రిపేరు కొచ్చింది. దీని రిపేర్ కోసం అదే గ్రామానికి చెందిన కల్లెడ సత్తయ్యను పిలిచినట్లు తెలిసింది. రిపేర్ చేస్తున్న సమయంలో హార్వెస్టర్ కట్టర్ బార్ ఎక్కిస్తుండగా మదన్ మోహన్ అజాగ్రత్తగా హార్వెస్టర్‌ను ముందుకు నడపగా సత్తయ్య ఎడమ కాలుపై నుంచి హార్వెస్టర్ టైర్ వెళ్లి తీవ్ర గాయం అయ్యింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ తదుపరి బాధితుడు సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసును నమోదు చేసి దర్యాప్తు చేసిన అప్పటి రూరల్ ఎస్ఐ సతీశ్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.