- వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగు
- నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
Science Fair: నిర్మల్, డిసెంబర్ 6 (మన బలగం): వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇన్‌స్పయిర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్, అధికారులు, అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ పాఠశాల ఎన్‌సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం, శోధన, పరిశీలన వంటివి పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా సొంతంగా ఇటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు తయారు చేయగలుగుతారని అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 800 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశారని తెలిపారు. చేసిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనల నుంచి ఎక్కువ సంఖ్యలో రాష్ట్రస్థాయిలోకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను అలరించాయి. అనంతరం ఎన్ సిసి అధికారులకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన వైజ్ఞానిక ప్రదర్శనలను కలెక్టర్, అతిథులు తిలకించారు. విద్యార్థులందరిని వారు తయారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనల గురించి సమాచారాన్ని అడిగి రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పి.రామారావు, గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలి, తహసిల్దార్ రాజు, ఏసీజీఈ పద్మ, ఎస్‌వో సలోమి కరుణ, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.