- ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో బహిర్గతం
- సీజ్ చేసిన అధికారులు
Karimnagar Dairy: జగిత్యాల, డిసెంబర్ 6 (మన బలగం): జగిత్యాలలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న కరీంనగర్ డెయిరీ సెంటర్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో కాలం చెల్లి ఫంగస్ చేరిన కేకులను సీజ్ చేశారు. అనంతరం మీడియాతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష మాట్లాడారు. ఈ నెల 3న షకీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేకు కొనుగొలు చేసి ఇంటికి వెళ్లి చుడగా అందులో ఫంగస్ చేరిన విషయాన్ని గుర్తించాడని తెలిపారు. తిరిగి కొన్న చోటుకే వచ్చి ఇదేమని అడిగితే నిర్లక్షపు సమాధానం ఇచ్చారని షకీల్ చెప్పాడని పేర్కొన్నారు. తిరిగి తమ కార్యాలయానికి వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా దాడి చేయగా షకీల్ కొనుగోలు చేసిన మిల్క్ కేకుల బ్యాచ్ స్టాక్ మొత్తాన్ని సీజ్ చేశామని అన్నారు. కరీంనగర్ మిల్క్ డెయిరీకి మిగతా 7 సెంటర్లలో ఈ బ్యాచ్ మిల్క్ కేకులను విక్రయించరాదని ఆదేశాలు ఇచ్చామని, వినియోగదారులకు ఎలాంటి నష్టం జరిగినా తమ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష కోరారు.